అమరావతి: రౌడీషీట్ తెరవడంపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎస్ఓ ఆధారంగా రౌడీషీట్ తెరవడం, సుధీర్ఘ కాలం కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 57 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. చట్టం అనుమతి లేకుండా వ్యక్తులపై నిఘా పెట్టడం, రౌడీషీట్ తెరవడం, రాత్రిపూట ఇళ్లలో సోదాలు నిర్వహించడం వంటివి చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా రౌడీషీట్లు తెరవడం, మూసివేయడాన్ని క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలు అందజేసింది. ప్రస్తుతం కోర్టు ముందున్న వివరాలను పరిగణనలోకి తీసుకుని రౌడీషీట్ తెరిచే విషయంలో సింగిల్ జడ్జి తీర్పును సస్పెండ్ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి హైకోర్టు ధర్మాసనం ముందు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ బీ శ్యాంసుందర్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కేసు నేరాలను నియంత్రించేందుకు నిందితులపై రౌడీషీట్ తెరిచిన వ్యవహారమని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ప్రభుత్వ న్యాయవాది వాదనను ఈ దశలో తోసిపుచ్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసి.. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు తిరిగి తెరవడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
అయితే, తాజాగా ఏమైనా ఆధారాలు ఉన్నపక్షంలో వాటి ప్రకారం ఆయా వ్యక్తులపై ఆయా షీట్లు తెరిచేందుకు పోలీసులకు స్వేచ్ఛనిచ్చిన ధర్మాసనం.. నిందితుడు, అనుమానితుడిపై నిఘా ఉంచాలనుకుంటే ప్రస్తుతానికి పీఎస్ఓ ప్రకారం వ్యవహరించాలని పోలీసులకు సూచించింది. ఎవరైనా వ్యక్తి లేదా నిందితుడిని స్టేషన్‌కు పిలువాలనుకుంటే చట్టప్రకారం ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. నిందితుడిని, అనుమానితుడిని అదుపులోకి తీసుకోవడానికి తప్ప రాత్రి వేళ్లలో పోలీసులు నిందితుల ఇళ్లకు వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వేలిముద్రలు సేకరించాలని భావిస్తే సింగిల్ జడ్జి పేర్కొన్న విధంగా చట్టనిబంధనలకు లోబడి వ్యవహరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.