Sathya Sai Jayanti | పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్‌పై ఏపీ హైకోర్టు మండిపడింది. సత్యసాయి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తే తప్పేముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ పిల్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఆదేశించింది. లేదంటే కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
సత్యసాయి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించడంపై ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భారత హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిధులను ఇలా మతపరమైన కార్యక్రమాలకు మళ్లించడానికి వీల్లేదంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సత్యసాయి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడంలో తప్పేముందని ప్రశ్నించింది. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఆయన మూడు జిల్లాలకు తాగునీరు అందించారని పిటిషనర్‌కు హైకోర్టు గుర్తుచేసింది. అలాగే ఆస్పత్రులు, విద్యా సంస్థలు సైతం స్థాపించి ప్రజలకు సేవ చేశారని వివరించింది. ఇలాంటి విశిష్ట వ్యక్తులను గౌరవించడంలో తప్పేముందని ప్రశ్నించింది.