Dev ji | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఆధారాలు లభిస్తే కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది.
దేవ్జీ, రాజిరెడ్డిలను హైకోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి గంగాధర్, హైదరాబాద్కు చెందిన మల్లా స్నేహలత హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహిన్కుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది, పోలీసుల వాదనలు విన్న ధర్మాసనం.. దేవ్జీ, రాజిరెడ్డి ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాల్లేవని.. ఈ పిల్లో జోక్యంచేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.