YS Jagan | ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వారిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన రూలింగ్‌ను సవాలు చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రూలింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రూలింగ్ ఏపీ జీతభత్యాలు, పెన్షన్లు, అనర్హత తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. జగన్ పిటిషన్ ఆధారంగా ఈ ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.