అమరావతి : వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ( Chevireddy Bhasker Reddy) ఏపీ హైకోర్టులో (High Court) చుక్కెదురయ్యింది. తిరుపతి పోలీసులు చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను వేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగగా కోర్టు చెవిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏండ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు దాడిచేసి మత్తు మందు తాగించారని తల్లిదండ్రులను నమ్మించింది. బాలిక చదివే పాఠశాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమెకు అండగా ఉంటామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని కేసు నమోదైంది.
వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేశారన్ని అభియోగంపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధితురాలు బాలిక కావడం వల్ల ఆమెతో పాటు కుటుంబ సభ్యుల గుర్తింపు ప్రచారం చేయడం పోక్సో చట్టం ప్రకారం ఉల్లంఘన అవుతుందని పోలీసులు తెలిపారు.