అమరావతి : ఏపీలోని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు (Dadishetti Raja) ఏపీ హైకోర్టులో (AP High Court) నిరాశే ఎదురయ్యింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ (Bail) కోరుతూ కోర్టులో పిటిష్ దాఖలు చేసుకున్నారు. కేసు మంగళవారం విచారణకు రాగా వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఐదు సంవత్సరాల క్రితం తుని నియోజకవర్గంలో తొండంగి విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణ(47)ను ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా కొందరు అడ్డగించి కత్తులతో నరికి చంపారు. ఈ హత్యకు దాడిశెట్టి రాజా ప్రధాన కారకుడంటూ మృతుడి కుటుంబీకులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దాడిశెట్టితో సహా ఆరుగురిని నిందితులుగా చేర్చారు. రాష్ట్రంలో వైసీపీ (YCP) హయాంలో మంత్రి అయ్యాక ఈ దర్యాప్తు ముందుకు సాగలేదు. 2023లో ఆయన పేరును ఛార్జిషీట్‌ను తప్పించారు.
నిందితులను శిక్షించాలంటూ మృతుడి సోదరుడు, న్యాయవాది గోపాలకృష్ణ ఐదు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ దశలో రాష్ట్రంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారడంతో మాజీ మంత్రి అయిన దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు రీ ఓపెన్ చేశారు. తనను పోలీసులు ఏ క్షణామైన అరెస్టు చేయవచ్చన ఉద్దేశంతో ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు కోర్టులో చుక్కెదురయ్యింది.