Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని పరిధిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ప్రపంచ వ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులను చేపట్టనున్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల విడుదల కూడా ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధుల్ని వెచ్చించాలని కూడా నిర్ణయించిన సంగతి తెలిసిందే.