Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవాళ ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది. ఈ సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. దీంతో ఘటనాస్థలంలోనే ఏడుగురు మృతి చెందారని తెలిపింది. పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటనలో పేర్కొంది.
ఈ తొక్కిసలాట ఘటనలో 13 మందికి గాయాలు అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరికి పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది.
కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం విషయానికొస్తే దీన్ని ఒడిశా రాజ కుటుంబానికి హరిముకుంద్ పాండా నిర్మించారు. ఒకసారి తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు శ్రీవారి దర్శనం అనుకున్నంత సాఫీగా జరగలేదు. దీంతో తానే స్వయంగా వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే కాశీబుగ్గలో తనకు వందెకరాల భూమి ఉండగా, అందులో 12 ఏకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. మే నెల నుంచే ఈ ఆలయంలో దర్శనాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి ఈ ఆలయం గురించి సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆలయానికి ప్రతి రోజు దాదాపు వెయ్యి మంది వరకు భక్తులు వస్తున్నారని సమాచారం. ఈ ఆలయం సామర్థ్యం కూడా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు 25 వేల మంది భక్తులు వచ్చారు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మరణించారు.