AP Excise Suraksha | ఈ రోజుల్లో మద్యాన్ని విచ్చలవిడిగా కల్తీ చేసేస్తున్నారు. ఆ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త యాప్‌ను రూపొందించింది. ఏపీ ఎక్సైజ్ సురక్షా పేరుతో ఈ యాప్‌ను రూపొందించారు. ఉండవల్లిలో ఈ యాప్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్‌ను డిజైన్ చేశామని తెలిపారు. ఈ యాప్‌తో స్కాన్ చేస్తే చాలు ఆ బాటిల్‌కు సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయని పేర్కొన్నారు. స్కాన్ చేశాక తయారీ కేంద్రం, తేదీ, బ్యాచ్ అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఆ బాటిల్‌ను ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుందని అన్నారు. దాన్ని మరోచోట అమ్మేందుకు వీల్లేదని చెప్పారు. అలా వేరే చోట అమ్మితే నేరమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని చంద్రబాబు తెలిపారు. వినియోగదారులు ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ యాప్‌ను యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తామని అన్నారు. నకిలీ మద్యం కేసులో ఎలాంటి రాజీ ఉండదని.. మొత్తం ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. బెల్ట్ షాపుల్లో అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత వైసీపీ పాలకులు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని చట్టబద్ధం చేసి మరీ నేర సామ్రాజ్యం సృష్టించారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యం నివారణకు సిట్, గంజాయి నివారణకు ఈగల్ బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు.