Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో విశాఖ ఉక్కు పరిశ్రమ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేసింది. తద్వారా స్టీల్ ప్లాంట్‌కు మరింత సాయం అందిస్తామని చెప్పింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.15వేల కోట్ల సాయం అందించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాలు వైజాగ్ స్టీల్‌కు ఈ ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించింది. అలాగే ఓవరాల్ కెపాసిటీ యుటిలైజేషన్‌ను సైతం ఈ 17 నెలల్లో 48 నుంచి 79 శాతానికి పెంచినట్లు తెలిపింది.
స్టీల్ కార్మికుల జీతాల్లో కోతలను విధిస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల జారీ చేసిన ఓ సర్క్యులర్ తీవ్ర చర్చనీయాంశమైంది. . నవంబర్ నుంచి ప్లాంట్ ఉత్పత్తి లక్ష్యాల ఆధారంగా వేతనాలు చెల్లిస్తామని.. ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోకుంటే జీతాల్లో కోతలు విధిస్తామని సర్క్యులర్‌లో తెలపడంపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతామని కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామన్న సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం గమనార్హం.