Maternity Leaves | మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెలవులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 120 మెటర్నిటీ లీవ్స్ ఇస్తుండగా.. వాటిని 180 రోజులకు పెంచింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
గతంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు వర్తించేవి. కానీ తాజాగా విడుదల చేసిన జీవోలో ఆ కండిషన్‌ను తీసేసింది. ఎంతమంది పిల్లలను కన్నా మాతృత్వ సెలవులను పొందవచ్చని ఆ జీవోలో పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా, కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. ప్రొబేషన్‌కు మాతృత్వ సెలవులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అప్పుడు గెజిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవులు అన్న నిబంధనను కూడా తొలగించింది.
సంతానోత్పత్తిని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు చాలా రోజులుగా పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును 1.5 శాతం నుంచి 2.1 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రోత్సహకాలు అమలు చేస్తామని ఇటీవల ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని తెలిపారు.