AP Government | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఏపీలోని వైఎస్ జగన్మోహన రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామగ్రామాన ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం నియమించిన వాలంటీర్లకు అందించే ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు అందిస్తున్న నగదు పురస్కారాల మొత్తం పెంచేసింది.
ఉత్తమ సేవలందించిన వాలంటీర్లలో సేవా వజ్ర పురస్కారానికి ఎంపికైన వారికి నగదు బహుమతి రూ.30 వేల నుంచి రూ.45 వేలకు పెంచివేశారు. సేవా రత్న పురస్కారం కింద రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచేశారు. సేవా మిత్ర పురస్కారం కింద రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,55,464 మంది వాలంటీర్లకు రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు అందిస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. ఉత్తమ గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేస్తామని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజులు వాలంటీర్ల పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం వైఎస్ జగన్ లాంఛన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.