liquor policy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులకు (licenses of liquor shops) దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. అయితే, మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని ప్రభుత్వానికి పలువురు నుంచి విజ్ఞప్తులు అందాయి. దసరా సెలవులు, ఇతర కారణాల నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం.. గడువును రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
11వ తేదీ పాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి లైసెన్సుదారులు దుకాణాలను ప్రారంభించుకోవచ్చు. ఇక అదేరోజు నుంచి కొత్త మద్యం విధానం (New liquor policy) అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ ఇవ్వగా మంగళవారం రాత్రి 9 గంటల వరకూ 41,348 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో రూ.826.96 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులుండగా వాటికి గతనెల 30న అర్దరాత్రి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో షాపును రూ.2లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు.
తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించింది. రెండో ఏడాది ఈ రుసుములపై పదిశాతం చొప్పున పెంచి వసూలు చేయడం జరుగుతుదన వివరించారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలని వెల్లడించారు.
రిటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్ ఉంటుందని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం , రాజమహేంద్రవరం , కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప ,అనంతపురాల్లో అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుందన్నారు. లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటి. వీటికి సంబంధించిన విధివిధానాలు విడిగా ఖరారు చేస్తామని తెలిపారు.
Also Read..
Accident | టూరిస్ట్ వ్యాస్ - కారు ఢీ.. ఐదుగురు మృతి
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి.. ట్రెండింగ్‌లోకి వచ్చిన జిలేబీ
Repo Rate: పదోసారి మార్పులేని రెపో రేటు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్