ముంబై: వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చలేదు. వరుసగా పదోసారి కూడా రెపో రేటు(Repo Rate)ను 6.5 శాతంగానే ఫిక్స్ చేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ ద్రవ్యపరపతి కమిటీ మీటింగ్ వివరాలను వెల్లడించారు. మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో అయిదుగురు అనుకూలంగా ఓటు వేసినట్లు శక్తికాంత్‌దాస్ తెలిపారు. మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌కు 8 ఏళ్లు గడిచాయని, సంస్థాగతంగా చోటుచేసుకున్న సంస్కరణ ఇదే అని ఆయన అన్నారు.
ఈ ఏడాది చివరి వరకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, బఫర్ స్టాక్ కూడా కావాల్సినంత ఉందని, దాని వల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జీడీపీలో ఇన్వెస్ట్మెంట్ షేర్ అత్యధిక స్థాయికి చేరినట్లు చెప్పారు. స్వదేశీ డిమాండ్ పెరగడం వల్ల మాన్యుఫ్యాక్చరింగ్ రంగం పుంజుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలు కూడా తోడ్పడినట్లు వెల్లడించారు.