చండీగఢ్, అక్టోబర్ 8: హర్యానా ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు ‘జిలేబీ’తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తియ్యటి జిలేబీని ఎన్నికల ప్రచారాస్త్రంగా ఆయన మార్చుకున్నప్పటీ చేదు ఫలితాలే వచ్చాయి. హర్యానాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు గొహానాలో బాగా ఫేమస్ అయిన లాలా మథురామ్ హల్వాయి అనే మిఠాయి దుకాణం నుంచి జిలేబీని తెచ్చి రాహుల్ గాంధీకి ఇచ్చారు. దీనిని రుచి చూసిన రాహుల్.. తన జీవితంలో ఇంత అద్భుతమైన జిలేబీని తినడం మొదటిసారి అని కితాబిచ్చారు.
హర్యానా జిలేబీ ప్రపంచవ్యాప్తం కావాలని, జిలేబీ తయారీ పరిశ్రమలు నెలకొల్పాలని సైతం ఆయన పేర్కొన్నారు. హర్యానా ప్రజల ఇష్టమైన వంటకాన్ని ప్రశంసించడం ద్వారా వారి ఆకట్టుకునేందుకు ఆయన ప్రయత్నించినప్పటికీ ఓట్లు కురిపించలేదు. ఇక ఈ రోజు కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపించింది. దీంతో ఆ పార్టీ నేతలు జిలేబీ పంచుకున్నారు. కానీ ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. దీంతో కమలం నేతలు కూడా కాంగ్రెస్‌కు కౌంటర్‌గా జిలేబీ ఆర్డర్ చేసి హస్తం పార్టీకి చురకలంటించారు. దీంతో ప్రస్తుతం ‘జిలేబీ’ ఎక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది.