అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా ( Alluri District ) చింతూరు ఘాట్ రోడ్డులో యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ( Private Travell Bus ) లోయలో పడి 9 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం నుంచి మరో రూ. 2లక్షలు క్షతగాత్రులకు రూ.2లక్షలు పరిహారంగా ( Exgratia ) ప్రకటించింది.
ఈ సందర్భంగా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అనిత పరామర్శించారు. మంత్రి అనిత మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని అన్నారు. శీతాకాలంలో ఘాట్‌రోడ్డులో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలు నిలిపివేస్తామని పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తున్నది. వారంతా చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లాకు చెందినది సమాచారం. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. ప్రయాణికుల హాహాకారాలతో ఘటనా స్థలం వద్ద హృదయవిదారక పరిస్థి నెలకొన్నది. ప్రమాదం నేపథ్యంలో చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.