Vijayawada | భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55)గా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియరాలేదు. శిథిలాల కింద చిక్కుకున్న అతని మృతదేహాన్ని తీసేలోపు కొండచరియలు మళ్లీ విరిగిపడ్డాయి. దీంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుడిని కోల్‌కతాకు చెందిన కార్మికుడిగా అనుమానిస్తున్నారు.
కొండ చరియలు విరిగి పడిన ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కొండచరియలు విరిగిపడిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు.
కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.
విజయవాడలో కుండపోత వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రిపై కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు విరిగి ప్రోటోకాల్ రూమ్‌పై పడ్డాయి. ముందస్తుగా ఘాట్ రోడ్ మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది.