AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది.
జిల్లాల పునర్విభజననై సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రుల కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై మంత్రులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మూడు జిల్లాలతో పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలోని పీలేరు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లె , శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లాలోని పెద్దహరివనం గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించింది. ఆదోనీ మండలాన్ని విభజించి పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.