YSR Congress Party | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఆ క్రమంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డికి పంపానన్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వైఎస్ జగన్కు అవంతి శ్రీనివాస్ సూచించారు. ఐదేండ్లు పాలించాలని కూటమికి రాష్ట్ర ప్రజలు తీర్పు చెబితే కనీసం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత ఐదేండ్లు పార్టీ కార్యకర్తలు నలిగిపోయారన్నారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్) ఆదేశాలిస్తే.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.