(AP employees) అమరావతి: పీఆర్సీ సాధించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో అమితుమికి సిద్ధమయ్యాయి. డిమాండ్ల సాధనకు ఆందోళనలే శరణ్యమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకొనేందుకు ఈ నెల 9న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చిందని, దాని ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై చర్చలు ముఖ్యమంత్రితో ఉంటేనే పని అవుతుందన్న విషయం తేలిపోయిందన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టాల్సిందిగా చాలా మంది ఉద్యోగులు అడుగుతున్నారన్నారు. ప్రభుత్వంతో మేం ఘర్షణ కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే మా పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
అధికారులు మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం వల్లనే పీఆర్సీ ఆలస్యం అవుతున్నదని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. కిందస్థాయి ఉద్యోగులను అవమానించే రీతిలో చర్చలు ఉన్నాయన్నారు. అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. పీఆర్సీ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం తమకు ఉన్నదన్నారు.