Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నుంచి తిరుమలకు పవన్ కల్యాణ్ కాలినడనక చేరుకున్నారు. అయితే మార్గమధ్యలోనే ఆయనకు వెన్ను నొప్పి రావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ శ్రీవారిని మనసులోనే తలచుకుంటూ పట్టుదలతో ఏడుకొండలు ఎక్కారు. బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తన ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. అయితే.. కొండ ఎక్కే సమయంలో వచ్చిన వెన్ను నొప్పితో పవన్ కల్యాణ్ తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.
తిరుమలలో బస చేసిన అతిథి గృహంలోనే ప్రస్తుతం పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడే ఆయనకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. నిన్న శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించారు.ఈ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించాల్సి ఉంది. ఈ సభలో పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు? సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఎలాంటి పోరాటానికి సిద్ధమవుతారో తెలుసుకోవాలని ఏపీ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో వారాహి డిక్లరేషన్ సభ ఉంటుందా? లేదా అనే సందిగ్ధత మొదలైంది. అయితే ఎంతటి జ్వరం ఉన్నా సరే పవన్ కల్యాణ్ వారాహి సభకు హాజరవుతారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.