Pawan Kalyan | విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను దహనం చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై అధికారులను ఆయన ఆరా తీశారు. దగ్ధమైన ఫైల్స్, రికార్డుల వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వ రికార్డుల దహనానికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి? భద్రపరిచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏంటో వెల్లడించాలని సూచించారు. ఇక, కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన అంశంపై పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండటాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకర్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజుగా పోలీసులు గుర్తించారు.
మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా ధ్వంసం చేసేందుకు డ్రైవర్ నాగరాజు ప్రయత్నించారు. రామారావు అనే యువకుడితో కలిసి కారులో యనమలకుదురు కట్ట వద్దకు వచ్చిన నాగరాజు.. బస్తాల్లో తీసుకొచ్చిన రికార్డులను తగులబెట్టాడు. ఇది గమనించిన స్థానికులు అనుమానంతో వారిని నిలదీశారు. దీంతో భయపడిపోయిన నాగరాజు, రామారావు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఈ ఘటనలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన పలు పత్రాలు, హార్డ్ డిస్క్‌లు, లెటర్ హెడ్స్, క్యాసెట్స్ దగ్ధమయ్యాయి.
స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పెనమలూరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పీసీబీ మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకే తాను పత్రాలు తగులబెట్టినట్లు నాగరాజు వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఫైల్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకు తగులబెట్టారు? అనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.