Pawan Kalyan | అమెజాన్ గిఫ్ట్ కార్డు సమస్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పారదర్శకంగా ఉండాలని సూచించారు. గిఫ్ట్ కార్డుల్లోని డబ్బులను ఈజీగా కస్టమర్ల బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
అమెజాన్ గిఫ్ట్ కార్డులో డబ్బులు వేయడం చాలా సులభంగా అయిపోతుంది.. సింపుల్‌గా కార్డు లేదా యూపీఐ సమాచారాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది.. అదే గడువు ముగిసిన గిఫ్ట్ కార్డు నుంచి డబ్బులు రికవరీ చేయడం అంత సులువుగా లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. దీని కోసం వినియోగదారులు తప్పనిసరిగా కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించి, తమ పరిస్థితిని వివరించాల్సి వస్తుందని అన్నారు. ఆ తర్వాత సుదీర్ఘ ప్రాసెస్ తర్వాత డబ్బు కస్టమర్ల బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అవుతుందని పేర్కొన్నారు. ఎక్స్పైరీ అయిన గిఫ్ట్ కార్డుల్లోని డబ్బులు ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతాలోకి వచ్చేలా విధానాలను ఎందుకు అమలు చేయకూడదని ఆయన ప్రశ్నించారు.
గడువు ముగిసిన గిఫ్ట్ కార్డుల నుంచి డబ్బులు ఈజీగా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వినియోగదారులు నష్టపోకుండా ఉంటారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ కచ్చితంగా ఈ విధానాన్ని సులభతరం చేయడంతో పాటు పారదర్శకంగా ఉండాలని సూచించారు. దీనివల్ల లక్షలాది మంది వినియోగదారుల నమ్మకాన్ని పొందవచ్చని తెలిపారు. సులభతరమైన విధానాలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అమెజాన్‌తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐని కోరారు.