Kasibugga Stampede | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లాలని జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను ఆదేశించారు.
ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ, లోకం నాగ మాధవిలు కాశీబుగ్గకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటనకు గల కారణాలను పరిశీలించి పవన్ కల్యాణ్‌కు నివేదిక అందించనున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు పి. చంద్రమోహన్, కొరికాన రవికుమార్, దానేటి శ్రీధర్, గేదెల చైతన్య తదితరులు ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు.

Kasibugga Janasena2
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట కారణంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని తెలిపారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుందని తెలిపారు.
కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలన్నారు.