Pawan Kalyan | మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. తనపై పుస్తకాలు చాలా ప్రభావం చూపాయని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఐరాస మాజీ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దేశ్వర్ పురి రచించిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జీవితంలో పుస్తకాల విలువను తెలియజేశారు.
నా గురించి నాకు ఏమీ చెప్పుకోవాలో తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. నేను రచయితను కాను.. కానీ నా ఆలోచనలను మాత్రం పంచుకోగలనని పేర్కొన్నారు. తాను భారతీయ ఆలోచనా విధానం నుంచి వచ్చినవాడిని అని చెప్పారు. చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నానని తెలిపారు. నేను వామపక్ష వాద పుస్తకాలు, జాతీయ వాదం గురించి చెప్పే పుస్తకాలను చదువుతానని పేర్కొన్నారు. లెఫ్టిస్ట్.. రైటిస్ట్ అనేది కాకుండా జీవితంలో బ్యాలెన్స్ ముఖ్యమని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకంలో మాలతి అనే పాత్రలో ధైర్యసాహసాలు, మేధస్సు కనిపిస్తాయని అన్నారు. భారతీయ స్వాతంత్య్రం, ఆనాటి సంస్కృతి సంప్రదాలు పుస్తకలో కనిపిస్తాయన్నారు. భారతీయ ధర్మం, సంస్కృతి.. స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతున్నాయని పేర్కొన్నారు. మనది మాతృస్వామ్య వ్యవస్థ అని.. అందుకే మహిళలకు ముందునుంచి పెద్దపీట వేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. నేను పూజించేది దుర్గాదేవిని.. ప్రతి మహిళను దుర్గాదేవిగా భావిస్తానని అన్నారు. మన దేశంలో స్త్రీకి అత్యున్నత విలువలు ఉన్నాయని తెలిపారు. జనసేన విభాగానికి ఝాన్సీ వీరమహిళగా పేరు పెట్టామని గుర్తుచేశారు. మా అమ్మ వంట గది నుంచే ప్రపంచాన్ని చూసేదని తెలిపారు.