Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులో స్టే విధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటీర్లపై పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వాళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గుంటూరులో కేసు నమోదైంది. దీంతో ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. కాగా తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మరోవైపు పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజిలో అటవీ ఉద్యోగులపై స్మగ్లర్ల దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ దాడిని ఖండించిన ఆయన.. పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. వన్యప్రాణుల అక్రమ రవాణాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇకపై ఎవరైనా వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా.. అటవీ ఉద్యోగులపై దాడి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.