Pawan Kalyan | గోరంతను కొండంతగా చేసి చూపించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మించిపోయారని వైసీపీ విమర్శించింది. అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేయడంలో కూడా గురువును మించిన శిష్యుడయ్యాడని ఎద్దేవా చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖలో ఏపీ సీఎం చంద్రబాబు కేవలం ఆరు నెలల్లోనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లలో గుంతలను పూడ్చడమే కానీ రోడ్లు వేసింది మాత్రం శూన్యమనే చెప్పాలని వైసీపీ పేర్కొంది. గుంతలు పూడ్చడానికి ఖర్చు చేసింది కేవలం రూ.860 కోట్లు మాత్రమే అని స్పష్టం చేసింది. ఇక కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుందని తెలిపింది. పీపీపీ విధానంలోనే కొత్త రోడ్లను నిర్మిస్తామని ప్రకటించి తద్వారా వాహనదారుల నుంచి భారీగా టోలు ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసిందని చెప్పింది. ఆ ముసుగులో టీడీపీ పెద్దలే కాంట్రాక్టర్లుగా మారి టోలు బాదుడుకు సిద్ధపడుతున్నారని మండిపడింది.
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సంవత్సరం కోవిడ్‌కు పోగా కేవలం 4 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.43 వేల కోట్లు ఖర్చు చేసిందని వైసీపీ తెలిపింది. రోడ్ల మరమ్మతుల కోసం రూ.4,648 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంది. రోడ్ల గుంతలు పూడ్చటం మాత్రమే కాదు.. వాటితోపాటు పెద్ద సంఖ్యలో జగన్ సర్కారు కొత్త రోడ్లను నిర్మించిందని చెప్పింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికింది.