Srisailam | దేవస్థానం ఆధ్వర్యంలో మ్యూజియం, ఆధ్యాత్మిక గ్రంధాలయం, ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి తగిన స్థలాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక, అంచనాలను రూపొందించాలన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి నలువైపులా గల ప్రధాన ద్వారాల ఆలయాలు, నాలుగు ఉపద్వారాల ఆలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో ఆయా క్షేత్రాధి దేవతలకు శ్రీశైలం దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆదేశించారు. శ్రీశైల క్షేత్ర పరిశోధనపై మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ జటా వీరభద్ర మఠ పున:నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
విభూతి మఠానికి దక్షిణాన గల ప్రాచీన మెట్ల మార్గం పునర్నిర్మించాలని అధికారులకు కొట్టు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలోనూ, పంచ మఠాల వద్ద, ఉపాలయాల వద్ద క్షేత్ర మహాత్యం, చరిత్ర తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల్నారు. శ్రీశైల ఆలయ ప్రాకార కుడ్య శిల్పాలను ఫోటోలు తీసి వ్యాఖ్యానంతోపాటు గ్రంథ రూపంలో ప్రచురించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరిలోగా గ్రంధ ప్రచురణ పూర్తి కావాలని స్పష్టం చేశారు.
శ్రీశైల క్షేత్రాన్ని ప్రస్తావించిన సంస్క్రుత, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ గ్రంథాలను పరిశీలించి, వాటిని తగిన వివరణలతో గ్రంధ రూపంలో ముద్రించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఘంటామఠం పునర్నిర్మాణంలో లభించిన శాసనాలను మైసూర్ లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు పరిష్కరిస్తారు. ఈ పరిష్కరణ పూర్తి కాగానే ఆయా శాసనాల పాఠాన్ని, వివరణ పొందుపరిచి గ్రంథం ముద్రించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
భ్రమరాంబా సదనం అతిథి గ్రుహంలో జరిగిన సమావేశంలో పరిశోధనా రంగంలో అనుభవం గల డాక్టర్ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి, శ్రీశైల ప్రభ మాసపత్రిక విశ్రాంత సంపాదకులు డాక్టర్ వీఎం చక్రవర్తి, తెలుగు విశ్వవిద్యాలయం-శ్రీశైలం ప్రాంగణంలో విధులు నిర్వహించిన ఆచార్య రామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దేవస్థానం ఈఓ వీ రామక్రుష్ణ, శ్రీశైల ప్రభ సంపాదకులు డాక్టర్ సీ అనిల్ కుమార్, దేవస్థానం సహాయ స్థపతి ఐయూవీ జవహర్ లాల్ పాల్గొన్నారు.