YS Sharmila | కూటమి ప్రభుత్వ సారథ్యంలో చంద్రబాబు నాయుడు అర్ధ సంవత్సర పాలన పూర్తిగా “అర్థ రహితం”గా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆరు నెలల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని.. మ్యానిఫెస్టోలో పెట్టిన 60 హామీలు పత్తాకు లేవని అన్నారు. మూడు సిలిండర్లలో ఈ ఏడాది సింగిల్ సిలిండర్ తో మమ అనిపించారని పేర్కొన్నారు. 3 వేల నిరుద్యోగ భృతి ఊసే లేకుండా చేశారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అవిగో , ఇవిగో అంటున్నారు.. స్కూల్ కి వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు ఇస్తామని తల్లులకు పంగనామాలు పెట్టారని అన్నారు. రైతుకి 20 వేల సాయం చేసే పథకం అన్నదాత సుఖీభవను దుఃఖిభవ చేశారని విమర్శించారు. ప్రతి నెల 1500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఇస్తామన్నారని.. ఆడబిడ్డ నిధి ఎక్కడో అడ్రెస్ లేదని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడూ అంటే పండుగలు, పబ్బాల పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జూన్ 12 న తొలి సంతకం పెట్టిన DSC నోటిఫికేషన్ కే ఇప్పటికీ దిక్కులేదని.. ఉచిత ఇసుక పథకంలో ఉచితం ఎక్కడా లేదని చెప్పారు బాబు 6 నెలల పాలన ఎలా ఉందో సోషల్మీడియా వేదికగా వివరించారు.
“మండలానికి 3 మద్యం షాపులు.. 30 బెల్టు షాపులు. అభివృద్ధిలో 3 మాటలు… 30 గ్రాఫిక్స్ డిజైన్లు”.. మొదటి 5 ఏళ్లలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే.. ఇప్పుడు మళ్ళీ అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని షర్మిల సెటైర్ వేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కాస్త ” బాబు షూరిటీ… వడ్డింపులకు గ్యారెంటీ ” లా మారిందని ఎద్దేవా చేశారు. వచ్చిన 6 నెలల్లోనే 17500 కోట్ల రూపాయలు జనం నెత్తిన వేశారని.. క్వాలిటీ మద్యం అంటూనే.. ధరలు పెంచి జనాలను పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆర్ధిక భారంపై మా తప్పేం లేదంటూనే జనం నెత్తిన మోపుతున్నారని విమర్శించారు.
ఇచ్చిన హామీలు సంగతి ఏంటి అని అడిగితే.. చంద్రబాబు ఇప్పటికీ చెప్తున్న సమాధానం..రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది.. వైసిపి వాళ్ళు 5 ఏళ్లు అడవి పందుల్లా మేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. గాడిలో పెట్టాలి అంటున్నారని వైఎస్ షర్మిల తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలన దోపిడీ పాలన. దొంగల పాలన అనేది నిజమేనని అన్నారు. నేల, నీరు, ఖనిజం , ఒకటేంటి.. కన్ను పడిందల్లా కాజేశారని విమర్శించారు. వాళ్ళు తిన్నారు కాబట్టే.. జనాలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. మీరేదో ఉద్ధరిస్తారని మీకు పట్టం కడితే మీరు చేసేది ఏంటని ప్రశ్నించారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని గాడిలో పెడుతూనే ఉంటారా? ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టరా? అని నిలదీశారు. ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డుపెట్టుకుంటూ.. 6 నెలలు కాలయాపన చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. మీ 4.0 ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది బాబు అని సూచించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాలన్నారు.