అమరావతి : ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలో పాలన ప్రారంభం కావాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఇదే విషయమై ఉన్నతస్థాయి సమీక్షసమావేశం మరికొద్ది సేపట్లో జరుగనుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మార్పులు, చేర్పులపై వివరంగా చర్చించి ఉగాది ముందు రోజు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
కాగా 13 జిల్లాలు ఉన్న ఏపీలో మరో 13 కొత్త జిల్లాలతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. వాటి పేర్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ప్రతిపాదనకు లోబడుతూనే.. భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, సౌలభ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దులను నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలుండగా, అరకు లోక్సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దదిగా ఉండడంతో, దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఉగాదికి మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో ప్రతిపాదించిన జిల్లాల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాలను సమకూర్చడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.