అమరావతి : రైతుల కడగండ్లను తీర్చేందుకు టీడీపీ హయాంలో ప్రారంభించిన పోలవరంను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని నిస్సాహయ స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని టీడీపీ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని డెడ్‌లైన్ పెట్టినప్పుడు లేదుగానీ డయాఫ్రం వాల్‌పై మాట్లాడడం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ హయాంలో పోలవరం పనులు 75 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. రూ. 11,537 పనులు చేపట్టామని వివరించారు. 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 16 జాతీయ ప్రాజెక్టు పనుల్లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా పోలవరానికి ఇచ్చిందని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరిట పనులు నిలిపివేసి చారిత్రక తప్పిదం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మూడేండ్ల పాలనలో ఎంతమేర పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు ఎంత ఖర్చు చేశారని, ఎన్ని ఇండ్లు కట్టారని ఆరోపించారు.