Chandrababu | బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి విశాఖ, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని చంద్రబాబు తెలిపారు. వాటిపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడు సమర్థత బయటపడుతుందని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులను హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, విశాఖ, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు ఆయా ప్రాంతాల్లో తీసుకుంటున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని పలు మన్యం గ్రామాలు జలదిగ్బధంలో చిక్కుకున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం వద్ద భారీగా గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. స్పిల్ వే ఎగువ నీటి మట్టం 29 మీటర్లు కాగా.. దిగువ నీటిమట్టం 19.16 మీటర్లుగా ఉంది. రాజమహేంద్రవరం వద్ద కూడా గోదావరి వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. దీంతో 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.