Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలవనున్నారు. పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు నిన్న మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ వచ్చారు.ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు.
పవన్ కల్యాణ్‌ను పరామర్శించేందుకే చంద్రబాబు వస్తున్నప్పటికీ.. వీరి భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా స్పందించి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం కానుండటంతో ఈ వివాదం గురించి చర్చిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.