Chandrababu | ఒకప్పుడు పండుగ చేసుకోవడం అంటే భయంగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకటో తారీఖునే పెన్షన్ వస్తోందని.. ఇది కూటమి ప్రభుత్వం సత్తా అని తెలిపారు. మరే ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదికలో గ్రామస్థులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. గతంలో ఒక నెల తీసుకోకపోతే పెన్షన్ కట్ అయిపోయేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. మూడు నెలల వరకు గడువు ఇస్తున్నామని అన్నారు. మీరు మట్టి పనులకు వెళ్లినా సరే అక్కడికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. పెన్షన్లు ఇచ్చిందే టీడీపీ ప్రభుత్వమని గుర్తుచేశారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయని.. కానీ ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.
దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయని.. ఉత్తరప్రదేశ్లో కేవలం రూ.500 మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. వందలో 13 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నామని.. అందులో 59 శాతం మహిళలకే అందజేస్తున్నామని చెప్పారు. ఒక్క పింఛన్తో మాత్రమే సరిపెట్టలేదని.. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేశామని తెలిపారు. అన్ని పథకాలు అమలు చేశామని తెలిపారు.
స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించామని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా వెళ్లవచ్చని సూచించారు. ఈ పథకం ద్వారా 10 కోట్ల ప్రయాణాలు చేస్తున్నారని తెలిపారు. అయితే అనవసరంగా ప్రయాణం చేయకండి అని సూచించారు. దేవాలయం, చదువు, ఉద్యోగాలకు ఈ పథకం ఉపయోగించుకుని వెళ్లండి సూచించారు. ఈ పథకం కోసం నెలకు 247 కోట్లు ఖర్చవుతున్నాయని.. అంటే ఏటా 2963 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.