AP CM Chandra Babu | ఫెయింజల్ తుఫాన్ నేపథ్యంలో మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ఆయన ఫెయింజల్ తుఫాన్ ప్రభావం, చేపట్టిన సహాయ చర్యలపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి, అధికార యంత్రాంగం చేపట్టిన సహాయ చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. 53 మండలాల పరిధిలో తుఫాన్ ప్రభావం ఉందని, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలను తరలించినట్లు వెల్లడించారు.
భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. వర్షాల ప్రభావం తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.