Chandrababu | ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న విజయసాయి రెడ్డి రాజీనామా అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ పార్టీలో ఇలాంటి పరిణమాలు జరుగుతుంటాయని తెలిపారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని.. లేదంటే ఇలాగే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారని అన్నారు.
ఏదేమైనా విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు అన్నారు. దీనిపై తాను కామెంట్ చేయనని అన్నారు. సాయిరెడ్డి రాజీనామా వైసీపీ పరిస్థితికి అద్దంపడుతుందని విమర్శించారు.
వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి వెళ్లడం వల్ల జగన్కు, పార్టీ తీవ్ర నష్టం జరిగినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని ఆయన తెలిపారు. తనలాంటి వాళ్లు వెయ్యి మంది వెళ్లినా జగన్కు ఆదరణ తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. తాను రాజీనామా చేయడానికి ముందు జగన్తో అన్ని విషయాలను చర్చించానని తెలిపారు. పదవికి రాజీనామా చేయడం సరికాదని కూడా జగన్ సూచించారని చెప్పారు. కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అబద్ధాలు చెప్పకుండా ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. దైవ భక్తుడిగా నేను అబద్ధాలు చెప్పలేను.. అందుకే తప్పుకుంటున్నానని వివరించారు.
వైసీపీ కోసం 2014 నుంచి సర్వశక్తులూ వినియోగించానని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్యకర్తల కోసమే నిరంతరం పనిచేశానని పేర్కొన్నారు. తాను వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని అన్నారు. తనలాంటి వాళ్లు పార్టీలో ఇంకా ఉన్నారని.. భవిష్యత్తులో వస్తారని స్పష్టం చేశారు