Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే అవమానం జరిగింది. కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో కనీస ప్రొటోకాల్ పాటించలేదు. ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరును ముద్రించలేదు.
కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవం ఇవాళ ( అక్టోబర్ 20వ తేదీన) నిర్వహించారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ సిబ్బంది ప్రత్యేక ఆహ్వాన పత్రికను ముద్రించారు. అందులో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మణ్ మునిరత్నం, ఐఏఎస్ అధికారులు సుమిత్ కుమార్, వికాస్ మర్మత్, యూనివర్సిటీ వీసీ దొరస్వామి, ప్రొఫెసర్ సంపత్ కుమార్ పేర్లను ముద్రించారు. కానీ కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును మాత్రం ముద్రించలేదు.
ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరును ముద్రించకపోవడాన్ని యూనివర్సిటీ అధికారులు గుర్తించలేదు. పైగా ఈ ఆహ్వాన పత్రిక అందుకున్న టీడీపీ నేతలు సైతం ఈ విషయాన్ని గమనించలేదు. కానీ ఈ పత్రిక సోషల్మీడియాలో వైరల్గా మారిన తర్వాత విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి పేరునే మరిచిపోతారా అని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.