హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు (72) మృతిచెందారు. కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఈ నెల 14న హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశారు. సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏఐజీ దవాఖానకు చేరుకొని నివాళులర్పించారు. రామ్మూర్తినాయుడు 1994లో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు భార్య ఇందిర, కొడుకులు రోహిత్, గిరీశ్ ఉన్నారు. రామ్మూర్తి మృతికి సీఎం రేవంత్‌రెడ్డి, సినీ నటుడు బాలకృష్ణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆదివారం ఉదయం ఆయన సొంతూరు నారావారిపల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.