Chandrababu | ఏపీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని.. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజకీయ హత్యలపై ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని జగన్కు సవాలు విసిరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చనిపోయిన 36 మంది పేర్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని శిక్షించే ప్రభుత్వం తమదని ఆయన స్పష్టం చేశారు. గతంలో మహిళలపై దాడులు జరిగితే శిక్షించలేదని అన్నారు.
వైసీపీకి ఏ మాత్రం విశ్వసనీయత ఉంటే.. అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలని అనుకుంటే 36 మంది పేర్లు పంపించాలని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అడిగారు. 36 రాజకీయ హత్యలు, ఎఫ్ఐఆర్లు ఇవ్వమని డిమాండ్ చేశారు. అబద్ధాల పునాదులపై పార్టీ పెట్టి.. ఆ అబద్ధాలపైనే బతికి, ప్రజలను మోసం చేసిన వాళ్లు ఇలాగే మాట్లాడుతుంటారని చంద్రబాబు మండిపడ్డారు. తన స్థాయికి దీనిపై మాట్లాడకూడదని అనుకున్నానని చెప్పారు. కానీ తాను మాట్లాడకపోతే హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. తన జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఆనాటి రాజకీయ నాయకులు హుందాతనంతో ప్రవర్తించేవాళ్లని తెలిపారు. ఇప్పుడు పద్ధతి లేని వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. అలాంటి వాళ్లు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు.. సమాజానికి కూడా చాలా ప్రమాదమని వ్యాఖ్యానించారు.
వినుకొండలో హంతకుడిది ఏ పార్టీ అని వైసీపీని చంద్రబాబు ప్రశ్నించారు. 36 మందిని చంపారని జగన్ అంటున్నారని.. నిజాయితీ ఉంటే వాళ్ల పేర్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్లు చంపిన వారి పేర్లను ఇచ్చామని తెలిపారు. ఆ కేసులను రీఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. నేరస్తులను నేరస్తులుగానే చూస్తామని తెలిపారు. తప్పులు చేసిన వారిని శిక్షించే ప్రభుత్వం తమదని చెప్పారు.