Srisailam | శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రాల్లో ఒకటైన ఆరో అష్టాదశ శక్తిపీఠం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయన తొలుత రత్నగర్భ గణపతిని దర్శించుకున్నారు. అనంతరం మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చన, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవోలు పాల్గొన్నారు.