హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ) : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన సమస్యలను పరిషరించాలని, అదేవిధంగా ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రజల్శక్తిశాఖను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్రజల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీకి చెందిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. 2027 గోదావరి పుషరాలలోపు పోలవరం ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కోరారు.
సాగునీటి అవసరాల దృష్ట్యా పరిమితికి మించి పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెకులకు పెంచామని, పెంచిన మేరకు నిధులను రీయింబర్స్మెంట్ చేయాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రపథకాల ద్వారా ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆల్మట్టి ఎత్తు పెంపు అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని, సాంకేతిక, పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయవద్దని, అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-3 కింద భూసేకరణ చేపట్టకుండా కర్ణాటకను ఆదేశించాలని బాబు డిమాండ్ చేశారు. ఇక రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రతిపాదించిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. వంశధారపై బరాజ్ నిర్మాణానికి గెజిట్ ప్రకారం ముందుకు వెళ్తామని, అవసరమైన భూసేకరణకు ఒడిశాను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.