Chandrababu | ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారితో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు.. వారి ఐదేండ్ల పనితీరుపై మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు ఇలా వ్యవహరిస్తారని.. పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును కలిసేందుకు సీఎం కార్యాలయానికి గురువారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వచ్చారు. ఆ సమయంలో వారందర్నీ మొదటు అంతస్తులోని మీటింగ్ హాలులో కూర్చొబెట్టారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వారి దగ్గరికి వెళ్లిన చంద్రబాబు ఐదారు నిమిషాలు మాట్లాడారు. రాష్ట్రాన్ని నాశనం చేశారు.. వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పాయి.. ఉన్నత స్థానాల్లో ఉన్న మీరు చాలా తప్పులు చేశారంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చంద్రబాబు మండిపడ్డారు. తనకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదని.. తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడూ మాట్లాడనని.. దెబ్బతిన్న రాష్ట్రం గురించే మళ్లీ మీతో వివరంగా మాట్లాడతానంటూ ధ్వజమెత్తారు. వ్యవస్థలను మళ్లీ పరిపాలన గాడిలో పెడతానని స్పష్టం చేశారు.