Chandrababu | అన్ని రంగాల్లో గిరిజనులు ముందు ఉండాలనేదే తన ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు నృత్యం చేశారు. డప్పు వాయిద్యాలు వాయించారు. అనంతరం అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహించామని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ఈ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అని అన్నారు.
అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలన అంతానికి పోరాడి ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. స్కూల్ టీచర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలిగారని అన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన ముఖ్యమంత్రి.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/XEK06av0c8
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2024