Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన గొప్పులు చెప్పుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాడు నీటిపారుదల, ప్రాజెక్టులపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు తాను ప్రారంభించినవే అని వెల్లడించారు. తొలిసారిగా అనంతపురంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం ప్రారంభించానని తెలిపారు. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు లిఫ్ట్ ద్వారా శ్రీశైలం ఎడమ కాల్వ ద్వారా నీళ్లిచ్చామని తెలిపారు.
నదుల అనుసంధానంతో సాగుకు ఊతమని గతంలో అప్పటి ప్రధాని వాజ్పేయీకి సూచించానని చంద్రబాబు తెలిపారు. అప్పుడు టాస్క్ఫోర్స్ వేసినా అనంతర పరిణామాలతో అది ముందుకు సాగలేదని పేర్కొన్నారు. అందుకే నదుల అనుసంధానం చేయాలని ప్రధాని మోదీకి కూడా సూచించానని అన్నారు. నదుల అనుసంధానానికి కొన్ని రాష్ట్రాలు సిద్ధంగా లేవని మోదీ చెప్పారని తెలిపారు. చొరవ చూపిన రాష్ట్రాలు ముందుకెళ్లాలని మోదీ సూచించారని పేర్కొన్నారు. సరైన సమయంలో గంగా, కావేరి అనుసంధానం చేపడతామని అన్నారని తెలిపారు. నదుల అనుసంధానం బాధ్యత ఎన్డీయే తీసుకుంటుందని స్పష్టం చేశారు. 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టులను గత ప్రభుత్వం చెడగొట్టిందని అన్నారు. వాటిని పూర్తిచేసే బాధ్యత తనకు దక్కడం పూర్వజన్మసుకృతమని వ్యాఖ్యానించారు.నదులు అనుసంధానించి నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నారు.
నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట రాదని చంద్రబాబు అన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన వినియోగంతో రాష్ట్రంలో 700 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. పదేళ్లలో 439 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చినట్లు తెలిపాపారు. డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తిచేస్తామని వెల్లడించారు. కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మసార్థకమైందని చెప్పారు.
2014-19 కాలంలో నీటిపారుదలకు రూ.68,417 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అన్నారు. అదే వైసీపీ పాలనలో రూ.28,376 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. ఈ ఏడాది నీటి పారుదలకు రూ.12,454 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఐదేళ్లలో నీటిపారుదలకు రూ.70 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపడతామన్నారు. మేజర్, మీడియం జర్వాయర్లలో 94 శాతం నీళ్లు వచ్చాయని తెలిపారు.