Perni Nani | వైఎస్ జగన్ తనకు రాజకీయంగా అడ్డుపడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ భయంతోనే 2011 నుంచి జగన్ను రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రక్రియలో భాగంగానే జగన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని అన్నారు. అయినప్పటికీ జగన్ ధైర్యం కోల్పోకుండా నిలిచి, తొలుత 67 సీట్లు గెలిచి సత్తా చూపించారని అన్నారు. అప్పుడు కూడా తమ పార్టీని, జగన్ను నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు.
టీడీపీలోకి రావాలంటే ముందు రాజీనామా చేయాలని చెబుతున్న చంద్రబాబు.. అప్పుడు 23 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా జగన్ను ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని తేల్చి చెప్పారు. బాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరమని.. అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలు అని స్పష్టం చేశారు. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్లు జగన్కు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా 2029 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా వారికి బుద్ధి చెబుతారని అన్నారు.