Chandrababu | దేశానికి గేట్‌వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడిదారుల లక్ష్యంగా ఏపీ ఎదుగుతోందని తెలిపారు. వైజాగ్‌లో జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సదస్సుకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని.. 2047లోగా భారత్ నంబర్‌వన్ ఎకానమీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు, వనరులు, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే ఇండియాకు తిరుగు ఉండదని అన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయని తెలిపారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుందని అన్నారు. వైజాగ్‌ను సురక్షితమైన నగరంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. దేశానికి గేట్ వేలా ఏపీ మారుతోందని తెలిపారు. పెట్టుబడిదారుల లక్ష్యంగా ఏపీ ఎదుగుతోందని.. రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు.