Chandrababu | అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరోక్షంగా స్పందించారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలిసో తెలియకనో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని అన్నారు. తమ జిల్లా పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇంచార్జి మంత్రులపైనే ఉందని సూచించారు. ఎమ్మెల్యేలతో మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండేలా చూసుకోవాలన్నారు.
శాఖాపరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా సరే ఆయా శాఖల మంత్రులు గట్టిగా స్పందించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. చరిత్రలో తొలిసారిగా 93 శాతం రిజర్వాయర్లను నింపామని అన్నారు. విజన్ 2047కు పెట్టుకున్న 10 సిద్దాంతాల్లో ఇదో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. చామ్ విధానంలో పట్టణాభివృద్ధికి చేపట్టిన నిర్మాణాలను ఇతర శాఖలు అందిపుచ్చుకోవాలని సూచించారు.
పూర్వోదయ పథకంలో ఏపీకి స్థానం లభించిందని మంత్రులకు చంద్రబాబు తెలిపారు. ఈ పథకం ద్వారా ఉద్యాన, ఆక్వా రంగాల్లో రాష్ట్రానికి రూ.65 కోట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ తరహాలో అన్ని ప్రాంతాల్లోనూ ఈవెంట్లు నిర్వహించాలని సూచించారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఈవెంట్లను నిర్వహించాలన్నారు. కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమను 2028కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. కర్నూలులో ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.