Free Bus Scheme | ఎట్టకేలకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పథకం ప్రారంభానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
ఉండవల్లి గుహల వద్ద నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఆ ఆర్టీసీ బస్సులోనే వెళ్లారు. కాగా ఉచిత బస్సు పథకం ప్రారంభం నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హడావుడి చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మార్గం వెంబడి బాణసంచా కాల్చారు. డీజే, తీన్మార్ డ్యాన్సులతో హంగామా చేశారు.
మరో సూపర్ సిక్స్ హామీ, “స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణ పథకం” ప్రారంభం..
ఉండవల్లి నుంచి విజయవాడకు ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ గారు.#SthreeShakti… pic.twitter.com/6DL1HyVQcX
— Telugu Desam Party (@JaiTDP) August 15, 2025
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. నాన్‌స్టాప్, సరిహద్దు రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. తిరుమల ఘాట్ రోడ్డుపైకి వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం లేదు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదో ఒక కార్డు చూపించి మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం పొందవచ్చు. బస్సు ఎక్కిన మహిళలకు జీరో ఫేర్ టికెట్లను జారీ చేస్తారు. ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయనుంది.