Chandrababu | గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విజన్ డాక్యుమెంట్ 2047పై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని అన్నారు. గతంలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయని అన్నారు. అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని చెప్పారు.
చరిత్రలో ఏ నాయకుడు చేయనన్ని తప్పులు గత ముఖ్యమంత్రి జగన్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని.. అప్పులు పరాకాష్టకు చేరాయని తెలిపారు. వాస్తవాలను పక్కనబెట్టి వాళ్లు నమ్మిన అవాస్తవాలను ప్రచారం చేశారని చంద్రబాబు అన్నారు. బరితెగించి తప్పులు చేసి, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. గతంలో విజన్ 2020 తీసుకొచ్చానని.. ఇప్పుడు స్వర్ణంధ్ర విజన్ 2047 తీసుకొస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎవరు వచ్చినా ఈ విజన్ చెడిపోకుండా ఫౌండేషన్ వేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అమరావతిని విధ్వంసం చేశారని చంద్రబాబు అన్నారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రారని అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు రావని పేర్కొన్నారు. రౌడీ రాజకీయాలు చేస్తామంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని చెప్పారు. రాజకీయం ప్రజల కోసమే కానీ.. స్వార్థం కోసం కాదని హితవు పలికారు.