ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకం కింద ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు అందిస్తామని తెలిపారు. దీనికోసం ఏడాదికి రూ.2948 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
దీపం పథకం అమలు, విధివిధానాలపై ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వమించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాల విషయంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి పథకం ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి.. అన్ని అర్హతలు కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్ధిదారులు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి సిలిండర్ కోసం బుకింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.